'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత

  • 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్‌తో ఫేమస్ అయిన షేక్ మహ్మద్ పాషా మృతి
  • హైదరాబాదులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిన వైనం
  • 'గుంటూరు కారం' సినిమాలో పాటతో మరింత పాప్యులర్
  • మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా
'కుర్చీ మడతపట్టి' అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షేక్ మహ్మద్ పాషా (64) బుధవారం కన్నుమూశారు. ఆయనను అందరూ 'కుర్చీతాత' లేదా 'కాలా పాషా'గా పిలుస్తుంటారు. మంగ‌వారం మ‌ధ్యాహ్నం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఎండ తీవ్రతకు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు. అప‌స్మార‌క‌స్థితిలో ప‌డిఉన్న ఆయ‌న‌ను యూట్యూబ‌ర్ వైజాగ్ స‌త్య ఇంటికి చేర్చారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై త‌న ఒడిలోనే ప్రాణాలు వ‌దిలాడని భార్య ఆసియా సుల్తానా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 

వరంగల్‌కు చెందిన పాషా, సుమారు 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి రహ్మత్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కుటుంబ సంభాషణ గురించి చెబుతూ ఆయన వాడిన 'కుర్చీ మడతపెట్టి' అనే పదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాప్యులారిటీతో మహేశ్‌ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రంలోని టైటిల్ సాంగ్‌లో ఇదే పదాన్ని పాడే అవకాశం దక్కించుకున్నారు. ఆ పాటతో ఆయన మరింత ఫేమ‌స్ అయ్యారు.

అయితే, కొంతకాలంగా మద్యానికి బానిసైన పాషా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుర్చీతాత‌కు భార్య‌, ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Kurchi Thatha
Sheikh Mohammad Pasha
Kurchi Madathapetti
Kaala Pasha
Guntur Kaaram
Viral Video
Social Media Influencer
Hyderabad
Telugu News
Death

More Telugu News